18, ఏప్రిల్ 2011, సోమవారం

అన్నా హజారే
 
అన్నా హజారే... నిన్నా మొన్నటి వరకు ఈ పేరు బహు కొద్ది మందికి మాత్రమే తెలుసు. జన లోక్ పాల్ బిల్లు కోసం ఆయన చేపట్టిన ఆమరణ నిరాహార దీక్షతో పలువురికి హీరో అయిపోయారు సామాజిక స్పృహ ఉన్న వారి నుంచి పాటశాల విద్యార్థుల వరకూ అంతా మీ వెనుక మేమున్నాము అనే విధంగా అన్నా హజారేకు మద్దతుగా దేశ వ్యాప్తంగా నిరసనలు చేశారు. దీంతో ఒక్కసారిగా దేశంలో విప్లవ గీతికలు వినిపించడంతో చివరకు కేంద్ర పాలకులు దిగొచ్చారు. నిజంగానే ఆయన ఓవర్ నైట్ హీరో మాత్రం కాదు. జీవితంలో ఎన్నో ఒడిదుడుకులను అనుభవించి అంచెలంచెలుగా ఈ స్థాయిని చేరుకొన్నారు. ఓ గ్రామాన్నే ఆదర్శంగా తీర్చి దిద్దిన ఘనుడు. వాస్తవానికి జీవితంపై విరక్తితో ఓ సారి ఆత్మహత్యకు ప్రయత్నించిన ఆయనకు రెండు సార్లు మృత్యువు సమీపంలోకి వచ్చి వెళ్లి పోయింది. ఎవరీ అన్నా హజారే?.. ఏమిటీ ఆయన గొప్పతనం?.. నేడు ఎందరిలోనో స్ఫూర్తి జ్వాలలను రగిలించి ఆదర్శంగా నిలిచిన ఆయన చరిత్ర తెలుసుకొందాం.


ఆయనో సైనికుడు

భారత సైన్యంలో 1960 వ ఏడాది చేరిన అన్నా హజారే 1965 వ ఏడాది జరిగిన ఇండో-పాక్ యుద్ధంలో సైనిక వాహన డ్రైవరుగా ఉన్నారు. పశ్చిమ ప్రాంతంలోని ఓ చోట వాహనం నడుపుతూ తమ పైన ఆకాశంలో పాకిస్తాన్ యుద్ధ విమానం ఎగరడం చూసి సహచరులను హెచ్చరిస్తూ ఆయన వాహనం నుంచి దూకేశాడు. మిగతా వారు కూడా వాహనం నుంచి కిందకు దూకేశారు. అప్పటికే పై నుంచి బాంబుల వర్షం కురవటంతో వాహనం తునా తునకలు కాగా అన్నా హజారే తప్ప మిగిలిన సైనికులు అంతా మరణించారు. మరో సారి నాగాల్యాండ్ లో పని చేస్తుండగా బహిర్భూమి కోసం అన్నా హజారే బయటకు వెళ్ళారు. అదే సమయంలో అతడు పనిచేస్తున్న సైనిక గస్తీ కేంద్రంపైన గుర్తు తెలియని నాగాలు దాడి చెయ్యగా అందులోని అన్నా హజారే సహచరులు అందరూ మరణించారు. ఈ రెండు ఘటనలకు ముందే ఓ సారి ఆత్మ హత్యా చేసుకోవడానికి అన్నా హజారే ప్రయతించారు. అందుకు ఆయన ఒంటరి తనమే కారణం.



గ్రామాభివృద్ది ధ్యేయంతో...

1975 వ ఏడాది సైన్యం నుంచి విరమణ చెందినా తర్వాత రాలేగాన్ చేరుకున్న అన్నా హజారేకు సారా బట్టీలు, బహిరంగ ప్రదేశాల్లో మల, మూత్ర విసర్జనాలు దర్శనం ఇచ్చాయి. అప్పటికే సామాజిక స్పృహ కలిగిన ఆయనలో ఈ విషయాలు తీవ్ర ప్రభావం చూపాయి. "ఆకలిగొన్న వ్యక్తి నుంచి సూత్రబద్ధ జీవితాన్ని ఆశించలేరు. ఎందుకంటే అతనికి, అతని కుటుంబానికి తిండి సమకూర్చుకోవటమే అతని తొలి ప్రాధాన్యంగా ఉంటుంది." అని అన్నా హజారే నమ్మారు. అందుకే ముందుగా వ్యక్తుల జీవన విధానంలో మార్పు తీసుకురావాలని నిర్ణయించారు. రాలేగాన్ సిద్దిలో వ్యవసాయమే ప్రధానం కావటంలో సాగునీటి వ్యవస్థను పటిష్టం చేసేందుకు చర్యలు చేపట్టి వాటర్ షెడ్ ను గ్రామస్తుల సహకారంతో నిర్మించారు. నేలకొత్త నివారణకు, భూగర్భ జలాలు పెంచేందుకు కొండ వాగులు పొడువునా కాలువలు, వాగు గసికలు నిర్మించారు. గ్రామంలో మూడు లక్షల మొక్కలు నాటించారు. వాటర్ షెడ్ ప్రయోగం ఆశించిన మేరకు సత్ఫలితాలు ఇవ్వడంతో గ్రామస్తుల జీవనాధారం పెరిగింది.

సారాపైన పోరాటం


గ్రామంలోని సారా బట్టీలు మూసివేయాలని గ్రామ ప్రజల సమక్షంలో అన్నా హజారే తీర్మానించాడు. దీనికి అంగీకారంగా 30 బట్టీలు మూతపడగా కొందరు మాత్రం లెక్క చెయ్యలేదు. దీంతో వారి బట్టీలను యువకుల సహకారంతో అన్నా హజారే ధ్వంసం చేయించారు. ఇలా 25 ఏళ్ల కిందటే గ్రామం నుంచి సారాను పారదోలారు. ఆ తర్వాతి మూడేళ్ళకు గ్రామంలో పొగాకు ఉత్పత్తులు నిషేదించాలని నిర్ణయించి ఆ మేరకు దుకాణాల్లోని పొగాకు చుట్టాలు, సిగరెట్లు, బీడీలను ఒకచోట కుప్పగా పోసి వాటిని యువకుల బృందం తగులబెట్టింది. అప్పటి నుంచి ఆ గ్రామంలో పొగాకు ఉత్పత్తులు విక్రయించడం లేదు. తర్వాత అక్షరాస్యత రేటు, విద్యా స్థాయి పెంచేందుకు చర్యలు చేపట్టి 1975 వ ఏడాది ప్రీ స్కూల్ ను ఏర్పాటు చేశారు. ప్రాథమిక పాటశాల మాత్రమే ఉన్న ఆ గ్రామంలో 1979వ ఏడాది ఉన్నత పాటశాల ఏర్పాటు చేశారు. అయితే అందుకు ప్రభుత్వం అనుమతి ఇవ్వక పోవటంతో జిల్లా పరిషత్ కార్యాలయం ఎదుట నిరాహార దీక్ష చేశారు. ఆయనకు గ్రామ ప్రజలంతా బాసటగా నిలబడటంతో చివరకు ప్రభుత్వం తలొగ్గింది. సమాజంలో బలహీనత వర్గాలకు చెందిన 200 మంది చిన్నారుల కోసం హాస్టల్ భవనం కూడా నిర్మించారు. గాందేయవాదాన్ని అనుసరించే ఆయన అవసరమైతే శివాజీ మార్గాన్ని కూడా అనుసరించాలి చెబుతారు. ఊరుమ్మడి భూముల్లోని చెట్ల నుంచి ఎవరైనా పండ్లను దొంగిలిస్తే అతడిని స్తంబానికి కట్టేసేవాళ్ళు. బహింగ శిక్ష వాళ్ళ భయంతో పాటు చేసిన తప్పుకు నలుగురిలో సిగ్గుపడి మళ్ళీ తప్పు చేయ్యరనేది ఆయన అభిమతం. అదే విధంగా గ్రామంలోని పండ్లు కాసే చెట్ల వద్ద ఎవరూ కాపలా ఉండక పోవటం గమనార్హం.


ఆదర్శం

నలుగురికి ఆదర్శ మార్గంలో నడిపించాలంటే ముందు మనం ఆదర్శంగా ఉండాలి.అన్నా హజారే విషయంలోనూ అదే జరిగింది. ఆయన తన భూమిని హాస్టల్ నిర్మాణం కోసం ఇచ్చేశారు. తన పించను డబ్బులను గ్రామ నిధికి ఇచ్చేశారు. ప్రస్తుతం కొద్ది వ్యక్తిగత వస్తువులతో మాత్రం గుడిలో ఉంటున్నారు. హాస్టల్ విద్యార్థులకు వండే భోజనమే ఆయన కూడా తింటున్నారు. పరమ నిస్వార్థ,నిరాడంబర జీవితం కొనసాగించడం వల్లే ఆయన తిరుగులేని నేతగా ఉన్నారు.


అవార్డులు...


* 1986 నవంబరు 19 వ తేది అప్పటి ప్రధాని రాజీవ్ గాంధి చేతుల మీదుగా ఇందిరా ప్రియదర్శిని వృక్షమిత్ర అవార్డు అందుకున్నారు.

* 1987 జనవరి 15వ తేది అహ్మద్ నగర్ మున్సిపల్ కార్పోరేషన్ నుంచి సన్మానం పొందారు.
* 1989 వ ఏడాది మహారాష్ట్ర ప్రభుత్వం నుంచి కృషి భూషణం అవార్డు అందుకున్నారు.
*  పూణే మున్సిపల్ కార్పోరేషన్ నుంచి సన్మానం పొందారు.

* రాలేగాన్ గ్రామాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దినందుకు 1990వ ఏడాది ఆయన్ను భారత ప్రభుత్వం పద్మశ్రీ అవార్డుతోనూ, 1992 వ ఏడాది పద్మ విభూషణ్ అవార్డుతోనూ గౌరవించింది.

*  2008 ఏప్రిల్ 15 వ తేది ప్రపంచ బ్యాంక్ యొక్క జిత్ గిల్ స్మారక అవార్డు అందుకున్నారు.


నిరుపేద కుటుంబంలో పుట్టి...

అన్నా హజారే భింగర్ లో 1940 జనవరి 15 వ తేది ఓ నిరుపేద కుటుంబంలో జన్మించాడు. సైన్యంలో పనిచేసిన ఆయన తాత ఉద్యోగ రీత్యా భింగర్ వెళ్ళగా అక్కడే అన్నా హజారే పుట్టాడు. ఆయన అసలు పేరు కిసాన్ బాబూ రావ్ హజారే. తండ్రి బాబూ రావ్ హాజారే అనిపుణ కార్మికుడు. అన్నా హజారే తాత 1945 వ ఏడాది మరణించగా 1952 వ ఏడాది వరకు ఆయన కుటుంబం భింగర్ లోనే ఉండిపోయింది. తర్వాత బాబూ రావ్ హజారే తన ఉద్యోగానికి రాజీనామా చేసి కుటుంబంతో సహా రాలేగాన్ సిద్దికి వెళ్ళిపోయాడు. అన్నా హజారేకు ఆరుగురు సోదరులు ఉండగా ఆ కుటుంబ పరిస్థితి కష్టంగా మారింది. దీంతో పిల్లలు లేని బాబూ రావ్ చెల్లెలు అన్నా హజారేను తనతో పాటు ముంబైకు తీసుకు వెళ్ళింది. అక్కడ ఏదో తరగతి వరకు చదివిన అన్నా హజారే తన కుటుంబానికి చేదోడుగా ఉండేందుకు దాదర్ లోని ఓ పూల దుకాణంలో నెలకు 40 రూపాయల వేతనానికి పనిలో చేరాడు. కొన్నాళ్ళకు సొంత దుకాణం ప్రారంభించగా అతని ఇద్దరు సోదరులు కూడా అతని వ్యాపారం గమనించుకోవడంతో నెలకు 800 రూపాయల వరకు సంపాదించాడు. తర్వాత తాగుడు, వీది కొట్లాటలకు అలవాటు పడ్డాడు. భారత సైన్యంలో చేరిన అతడు మొదటి శిక్షణ కోసం ఔరంగబాద్ పంపారు. తర్వాత పంజాబ్ లో ట్రక్కు డ్రైవరుగా నియమించారు. అప్పుడే ఒంటరితనం భరియించలేక ఆయన ఆత్మహత్యకు ప్రయతించాడు. తన చెల్లెలి పెళ్లి ప్రయత్నాలకు అది విఘాతం కలిగిస్తుందని భావించి అప్పట్లో ఆ ప్రయత్నం విరమించుకున్నాడు.

వివేకానందుడి ప్రభావం...

ఆతంహత్య ప్రయత్నం నుంచి, రెండు సార్లు మృత్యువు నుంచి భయటపడిన తర్వాత ఓ సారి ఆయన న్యూడిల్లీ రైల్వే స్టేషన్లోని పుస్తక విక్రయ కేంద్రంలో 'జాతి నిర్మాణం కోసం యువతకు పిలుపు' అనే వివేకనదుడి పుస్తకం చదివాడు. అందులోని వివేకానందుడి బోధనలు బోధనలు ఆయనలో ప్రభావం చూపించాయి. దీంతో తన శేష జీవితం సమాజం కోసం గడపాలని నిర్ణయించారు. ఆ తర్వాత వివేకానందుడు, మహాత్మ గాంధి, ఆచార్య వినోబా భావే తదితరుల రచనలను చదివి ప్రేరణ పొందారు. అప్పుడే తను బ్రహ్మచారిగా ఉండిపోవాలని నిర్ణయించారు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి